మరోసారి హైదరాబాద్ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన
హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో వాన పడింది. గత 10 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో అల్లాడిస్తున్న వరుణుడు, తాజాగా భాగ్యనగరంపై మరోసారి వాన కురిపించాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారులతో పాటు బస్తీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకుంది. ఈ మేరకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మారేడుపల్లి, బేగంబజార్, ప్యాట్నీ, పంజాగుట్ట, హిమయత్ నగర్, హైదర్ గూడ, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, అమీర్ పేటతో పాటు నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ(IMD) వెల్లడించింది. ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురవనున్నట్లు స్పష్టం చేసింది.