తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు
రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో బుధ,గురువారాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నట్లు వెల్లడించింది. సోమవారం అత్యధికంగా కామారెడ్డిలో 74.8 మి.మీ, హైదరాబాద్ తిరుమలగిరిలో 57.3 మి.మీ వర్షపాతం కురిసిందని వివరించింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వానలు పడనున్నట్లు IMD ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమైన్నట్టు తెలిపింది. మహారాష్ట్ర, కొంకణ్, పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.