IPL Records: ఐపీఎల్ హిస్టరీలో రికార్డులు.. గేల్ నుంచి కోహ్లీ వరకు ఎవరి రికార్డు ఏంటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత రికార్డులు నమోదయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్, జట్టు ప్రదర్శనల పరంగా కొన్ని రికార్డులు ఇప్పటికీ చెరగని ముద్ర వేశాయి. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన విషయానికి వస్తే.. క్రిస్ గేల్ 2013 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున, పూణే వారియర్స్ ఇండియాపై అజేయంగా 175 పరుగులు చేశారు. కేవలం 66 బంతుల్లో ఈ ఇన్నింగ్స్ ఆడుతూ 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదారు. ఇప్పటికీ ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
వివరాలు
బౌలింగ్‌లో అదరగొట్టారిలా..
బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన అల్జారి జోసెఫ్ పేరిట ఉంది. 2019 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్లు తీసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ఆయన గణాంకాలు 3.4 ఓవర్లు, 1 మెయిడెన్, 12 పరుగులు, 6 వికెట్లుగా ఉంది. టీమ్ పరంగా అత్యధిక స్కోరు 2024 ఐపీఎల్‌లో నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆర్‌సీబీపై 287/3 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేశారు.
వివరాలు
అత్యధిక సిక్సర్లు బాదింది..క్రిస్ గేలే..
ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా క్రిస్ గేల్ పేరే ఉంది. అదే 175 పరుగుల ఇన్నింగ్స్‌లో ఆయన 17 సిక్సర్లు కొట్టారు. ఇప్పటికీ ఈ రికార్డు చెదరలేదు. ఒక మ్యాచ్‌లో మొత్తం అత్యధిక సిక్సర్ల రికార్డు 2024లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో నమోదైంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 42 సిక్సర్లు బాదాయి. కేకేఆర్ 18 సిక్సర్లు కొట్టగా, పంజాబ్ జట్టు 24 సిక్సర్లు బాదింది. అత్యధిక లక్ష్యాన్ని ఛేజ్ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. 2024లో కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేజ్ చేసింది.
వివరాలు
తక్కువ స్కోర్ చేసింది ఆ టీమే..
అత్యల్ప స్కోరును కాపాడుకున్న రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 2025లో 111 పరుగులకు ఆలౌట్ అయినప్పటికీ, కేకేఆర్‌ను 95 పరుగులకు కట్టడి చేసి 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ భాగస్వామ్యం 2016లో నమోదైంది. ఆర్‌సీబీ తరపున ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ కలిసి గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 109, డివిలియర్స్ 129 పరుగులు చేశారు. ఓపెనింగ్‌లో అత్యుత్తమ భాగస్వామ్యం 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున నమోదైంది. కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ కలిసి కేకేఆర్‌పై 210 పరుగులు చేశారు.
వివరాలు
బౌండరీల వీరుడు కూడా క్రిస్ గేలే..
ఒక ఇన్నింగ్స్‌లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. 175 పరుగుల ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో మొత్తం 154 పరుగులు బౌండరీల ద్వారానే సాధించారు. ఒక మ్యాచ్‌లో అత్యధిక మొత్తం స్కోరు 2024లో ఆర్‌సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో నమోదైంది. రెండు జట్లు కలిసి 549 పరుగులు చేశాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 287/3 చేయగా, ఆర్‌సీబీ 262/7 చేసి 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.