
TGSRTC Strike: తెలంగాణలో బస్సులు బంద్.. అర్థరాత్రి నుంచి RTC సమ్మె ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రజలు పనులపై పండుగ పూట ఊరెళ్లే ప్రణాళికలతో తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా షాకింగ్ వార్త బయటపడింది
.'బస్సులు బంద్!'. అవును, ఈ అర్థరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఆగిపోనున్నాయి. దీంతో ప్రజా రవాణా సర్వీసులు స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్‌కు ఇది లబ్ధిదాయకంగా మారుతోంది.
రెట్లు రేట్లతో ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసే దృశ్యం మళ్లీ తెరపైకి రానుంది.
గతంలో ఎన్నోసార్లు చూశిన దృశ్యం ఇప్పుడు రిపీట్ కానుంది.
ప్రయాణికుల జేబులకు భారీ భారం పడే ప్రమాదం తథ్యమే. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(RTC)కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఇప్పటికే RTC జేఏసీ ప్రకటించింది.
Details
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు
ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లిలోని కళాభవన్ నుంచి బస్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వేలాదిమంది ఉద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీలో జేఏసీ ఛైర్మన్ వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మన సమస్యలు చెప్పినా స్పందించలేదు.
చివరికి సమ్మే ఒక్కటే మార్గంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ర్యాలీకి ముందస్తు అనుమతులు లేకున్నా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బస్‌భవన్ పరిసరాల్లో భద్రత పెంచిన పోలీసులు ఎవ్వరిని లోపలికి అనుమతించలేదు.
సమ్మెకు మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం ప్రజల్లో, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులపై ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించింది.
Details
సంస్థ అభివృద్ధిలో దశగా ఉండగా సమ్మె చేయడం ప్రమాదకరం
సంస్థ ఉద్యోగులకు భావోద్వేగ భరితమైన బహిరంగ లేఖను పంపిస్తూ ప్రస్తుతం సంస్థ అభివృద్ధి దశలో ఉండగా సమ్మె చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.
ఇది సంస్థను మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. తల్లి లాంటి RTCను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ ఉద్యోగులను సున్నితంగా కోరింది.
2019లో జరిగిన సమ్మెను గుర్తుచేస్తూ ఇప్పుడు RTC ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతుందని, ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని తెలిపింది.
ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యమని, ప్రతి రూపాయిని వారి వేతనాలు, రాయితీలు, భద్రతలకే ఖర్చు చేస్తున్నామని వివరించింది.
Details
ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలు నిషేధం
ఇక మరో కీలక అంశంగా ఆర్టీసీ ప్రస్తుతం ఎస్మా చట్టం (ESMA) పరిధిలో ఉండటాన్ని ప్రస్తావిస్తూ, ఈ చట్టం ప్రకారం సమ్మెలు నిషేధితమని స్పష్టం చేసింది.
చట్టాన్ని ఉల్లంఘించి విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని సంబోధిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ పరిస్థితుల్లో సమ్మె కొనసాగితే, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ప్రయాణాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.