కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు
పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచింది. దీంతో మొత్త డీఏ 46 శాతానికి పెరిగింది. దీని ద్వారా 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపుదల జరిగింది.
ఆరు పంటలకు ఎంఎస్పీ పెంపు
2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా, కేబినెట్ 2024-25 ఏడాదికి గాను గోధుమల ఎంఎస్‌పీని క్వింటాల్‌కు రూ.150పెంపుదలకు ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్‌కు ధర రూ. 2,275కి పెంచింది. రేప్‌సీడ్, ఆవాలు క్వింటాల్‌కు రూ.200, మసూర్ క్వింటాల్‌కు రూ.425, బార్లీ క్వింటాల్‌కు రూ.115, పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.150, మినుము క్వింటాల్‌కు రూ.105 చొప్పున పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లడఖ్‌లో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ విద్యుత్తును తరలించే ట్రాన్స్‌మిషన్ లైన్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మీదుగా హర్యానాలోని కైతాల్ వరకు వెళుతుంది.