Loading...
Manish Garg Row: మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ
మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ

Manish Garg Row: మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులు.. చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంఘం సీనియర్ అధికారి మనీశ్ గార్గ్ పనితీరుపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది. ఈ ఫిర్యాదులు కమిషనర్లు వ్యక్తిగత హోదాలో చేసినవని,వాటిని మొత్తం ఎన్నికల సంఘం అధికారిక ఫిర్యాదులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెలుగులోకి వచ్చిన పత్రాలతో ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది జులై 29న ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు,వివేక్ జోషి.. మనీశ్ గార్గ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. ఉన్నతాధికారుల విధులు,బాధ్యతల్లో మనీశ్ గార్గ్ ఇష్టానుసారంగా మార్పులు చేశారని వారు ఆరోపించారు.

వివరాలు 

ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధివిధానాలకు విరుద్ధం

ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్నికల కమిషనర్లతోగానీ, సంబంధిత అధికారులతోగానీ సంప్రదింపులు జరపలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

గతంలో ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోలేదని, ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లను కోరినప్పటికీ స్పందన రాలేదని వివేక్ జోషి తన లేఖలో పేర్కొన్నారు.

విధుల మార్పునకు సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధివిధానాలకు విరుద్ధంగా ఉన్నాయని ఇద్దరు కమిషనర్లు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, 2023లో తీసుకొచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి పని నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన చట్టంలోని నిబంధనలకు కూడా ఈ మార్పులు వ్యతిరేకమని పేర్కొన్నారు.

వివరాలు 

ఇద్దరు కమిషనర్లు పంపిన లేఖలను స్వీకరించిన క్యాబినెట్ సెక్రటేరియట్

అయితే, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ కావడంతో దాని అంతర్గత వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని క్యాబినెట్ సెక్రటేరియట్ స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘంలోని సభ్యులందరి తరఫున అధికారికంగా ఎలాంటి సమాచారం అందనప్పుడు, ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాలో చేసిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వివరించింది.

అలా చేస్తే రాజ్యాంగబద్ధమైన సంస్థ పనితీరులో జోక్యం చేసుకున్నట్లవుతుందని పేర్కొంది.

ఇద్దరు కమిషనర్లు పంపిన లేఖలను స్వీకరించినట్లు క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపింది.

వాటి ప్రతులను ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపాలని సూచించింది.

భవిష్యత్తులో మనీశ్ గార్గ్‌కు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత విభాగాలకు నోట్ పంపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ వివాదం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఓ అధికారికి సంబంధించిన వ్యవహారం 

మరోవైపు,మనీశ్ గార్గ్ జారీ చేసిన విధుల మార్పు ఉత్తర్వులు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆదేశాల మేరకు అమలు కాలేదని ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న వెల్లడించింది.

ఈవివాదం విధానపరమైన అంశాలకు లేదా సమాచార సాంకేతిక విభాగం పనితీరుకు సంబంధించినది కాదని,డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఓ అధికారికి సంబంధించిన వ్యవహారమని స్పష్టం చేసింది.

ఈ వివాదంపై మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్పందించారు.అసలు ఏం జరిగింది? కమిషనర్ల అభ్యంతరాలపై ఎన్నికల సంఘంలో చర్చ జరిగిందా?లేదా?అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

మరోవైపు,రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ,పూర్తి ఎన్నికల కమిషన్ సమావేశమై చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

కనీసం ఆ దిశగా ప్రయత్నం ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్టీఐతో కీలక విషయాలు

ADVERTISEMENT