West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు
లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడిన నిందితుడు షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. షేక్ పరారీలో ఉన్నందున హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. శివగణనమ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై మూకుమ్మడి దాడి జరిగినప్పటి నుంచి షాజహాన్ షేక్ బహిరంగంగా కనిపించడం లేదు.
మార్చి 4న మరోసారి విచారణ
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం బెనర్జీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. షాజహాన్ అరెస్టులో జాప్యానికి కోర్టు కారణమన్నారు. హైకోర్టు స్టే ఉండటం వల్లే షాజహాన్‌ను అరెస్టు చేయడం లేదన్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించిన ధర్మాసనం.. షాజహాన్ అరెస్ట్‌పై ఎప్పుడూ స్టే విధించలేదని స్పష్టం చేసింది. అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తప్పుబట్టింది. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై సింగిల్ బెంచ్ విచారణకు ఆదేశించిందని, సీబీఐ, రాష్ట్ర పోలీసుల సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపై మాత్రమే స్టే విధించినట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసును మార్చి 4న మరోసారి విచారించాలని డివిజన్ బెంచ్ నిర్ణయించింది.