Karnataka Judge: 'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు
భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా పాకిస్థాన్‌తో పోల్చడం అనుచితమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ విధమైన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు స్వతంత్రంగా విచారణ చేపట్టినప్పుడు, న్యాయమూర్తి బహిరంగంగా క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సీజేఐ సుమోటో ప్రొసీడింగ్స్‌ను విరమించారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే తీసుకున్నామని ఆయన తెలిపారు.
హైకోర్టు జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఓ భూవ్యవహార కేసు విచారణలో, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడంతో పాటు, కేసులో వాదించిన మహిళా న్యాయవాది పట్ల కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. న్యాయమూర్తులు కోర్టులో చేసే వ్యాఖ్యలకు సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది.