CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సన్నద్ధతపై సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ జనవరి 8 సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఈసీ ప్రతినిధులు సోమవారం ఏపీకి వచ్చి.. ఆ తర్వాత.. తమిళనాడుకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలపై సమీక్షించనున్నారు.
ఈసీ
దేశవ్యాప్తంగా ఈసీ అధికారుల పర్యటన
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారుల బృందం దాదాపు అన్ని రాష్ట్రాలను సందర్శిస్తోంది.
సాధారణంగా అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసు, పరిపాలనా అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల యంత్రాంగంతో సీఈసీ, ఈసీ అధికారులు సమావేశమై సమీక్షను నిర్వహించడం సర్వసాధారణం.
ఎన్నికల సంఘం అధికారులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శిస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పర్యటించకపోవచ్చు అని సమాచారం.
2019లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 10న విడుదలైంది. ఇప్పుడు కూడా అదే తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.