Page Loader
Green energy: తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్‌
తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్‌

Green energy: తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర విద్యుత్‌శాఖ గ్రీన్‌ ఎనర్జీ(హరిత ఇంధనం) ప్లాంట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది. తెలంగాణలో స్థాపించబడిన గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు జాతీయ విద్యుత్‌ గ్రీడ్‌లో ప్రత్యేక స్థలం కేటాయించనుంది. ప్రస్తుతం 15 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు వీలుగా ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. గతంలో తెలంగాణ ట్రాన్స్‌కో 13 వేల మెగావాట్లకు గ్రీడ్‌లో స్థలం కోరినప్పటికీ, భారత సౌరవిద్యుత్‌ సంస్థ (SECI) 15 వేల మెగావాట్లను సజావుగా సరఫరా చేసే విధంగా సిఫార్సు చేయగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాలకు గ్రీన్‌ ఎనర్జీ విక్రయాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం 'జాతీయ గ్రీన్‌ కారిడార్‌' పేరిట ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది.

Details

కారిడార్ ద్వారా సరఫరా చేసే వెసులుబాటు

ఈ కారిడార్‌ ద్వారా సౌర, పవన, జలవిద్యుత్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (BESS) వంటి పునర్వినియోగశీల ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. దేశంలోని ఎక్కడైనా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసినా, అక్కడి నుంచి అవసరమైన రాష్ట్రాలకు ఈ కారిడార్‌ ద్వారా సరఫరా చేసే వెసులుబాటు లభిస్తుంది. టీజీ రెడ్కో అంచనా ప్రకారం, ఒక్కో మెగావాట్‌ స్థాయిలో సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి సుమారు రూ.3.50 కోట్లు అవసరం. దీంతో 15 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి దాదాపు రూ.55 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Details

గ్రీన్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున్న పెట్టుబడులు

ఇక కొత్తగా ఏర్పాటయ్యే పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్ల నిర్మాణ పనులకు 2028 జూన్ 30లోగా కాంట్రాక్టుల కేటాయింపు పూర్తయితే, వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు పంపే అంతర్రాష్ట్ర రవాణా రుసుములను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తెలిపింది. అదేవిధంగా, ఒకే సబ్‌స్టేషన్‌ పరిధిలో స్థాపించే సౌర/పవన/జల విద్యుత్‌ ప్లాంట్లతో పాటు, అదే పరిధిలో ఏర్పాటు చేసే BESS వ్యవస్థల ద్వారా ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ పంపించినా రవాణా రుసుములు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఈ చర్యల వల్ల తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలదన్న నమ్మకం ప్రభుత్వానికి ఉంది.