భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు. అంతకుముందు మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఆదేశాలను కేంద్రం జారీ చేయలేదనన్నారు. 2020 మార్చిలో సైతం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోదీ సర్కారు లాక్‌డౌన్ విధించడాన్ని వారం పాటు ఆలస్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మాండవీయ
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతును చూసి బీజేపీ ఓర్వలేకపోతోందన్నారు. త్రిపురలో ప్రధాని ర్యాలీకి లేని కరోనా ప్రోటోకాల్ రాహుల్ యాత్రకు ఎందుకు అని ప్రశ్నించారు. మాండవీయ ప్రజల గురించి ఆలోచిస్తే.. మొదట ప్రధానికి లేఖ రాసి.. తర్వాత రాహుల్‌కు పంపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు. యాత్రలో పాల్గొన్న చాలా మందికి ఇన్‌ఫెక్షన్ సోకిందని రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు లేఖ రాసిన తర్వాతే.. తాను రాహుల్‌కు లేఖ రాశానని మాండవీయ చెప్పారు. రెండ్రోజుల క్రితం యాత్రలో పాల్గొన్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖు కూడా పాజిటివ్ బారినట్లు ఆయన పేర్కొన్నారు.