'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదువుతున్న కేసులను బట్టి.. సగటున రోజుకు 153 కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 5.87 లక్షల కేసులు నమోదవుతున్నాయన్నారు. దేశంలో ఇప్పటివరకు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయినట్లు పేర్కొన్నారు.
'దేశంలో కేసులు అదుపులోనే..'
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలుపెట్టినట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పండగలు, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌లను ఉపయోగించేలా, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కరోనా కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు మంత్రి మాండవియా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా.. దేశంలో మాత్రం అదుపులోనే ఉన్నాయన్నారు. చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలను నిశీతంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.