Loading...
Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు కేంద్రం బేషరతు క్షమాపణలు
దిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు కేంద్రం బేషరతు క్షమాపణలు

Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు కేంద్రం బేషరతు క్షమాపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ బుధవారం ఉన్నత న్యాయస్థానంలో నాలుగు పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పరిమిత ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

వివరాలు 

కోర్టు ధిక్కరణ నోటీసులతో వివరణ

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత వ్యవహారంపై అక్టోబర్ 11న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించారని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి తన వివరణను అఫిడవిట్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు.

వివరాలు 

మొబైల్ డేటా సేవలకే పరిమితం

ఇంటర్నెట్ నిలిపివేత నిర్ణయం కేవలం మొబైల్ సెల్యులార్ డేటా సేవలకే పరిమితమైందని గోవింద్ మోహన్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వై-ఫై, బ్రాడ్‌బ్యాండ్ వంటి నాన్-సెల్యులార్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయలేదని తెలిపారు.

అలాగే ఇతర టెలికమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం కలిగించలేదని వివరించారు.

అప్పటి పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

అత్యవసర పరిస్థితులపై మార్గదర్శకాల కోసం కేంద్రం విజ్ఞప్తి

అత్యవసర పరిస్థితుల్లో భద్రతా నిబంధనలకు లోబడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసేందుకు అనుమతించేలా అక్టోబర్ 11న జారీ చేసిన ఆదేశాలను అవసరమైన మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

ఈ నేపథ్యంలో కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT