LOADING...
PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు మరో 12,370 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.185.55 కోట్ల కేంద్ర సాయాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.74.22 కోట్ల విడుదలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇటీవల జరిగిన 7వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (CSMC) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 119 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ 12,370 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

వివరాలు 

సెప్టెంబర్ 30లోపు పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి 

అయితే రాష్ట్రంలో పీఎంఏవై , పీఎంఏవై-యు 2.0 పథకాల అమలు ఆశించిన వేగంతో సాగడం లేదని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని,ఆ గడువు దాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే వ్యయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తెలిపింది.

వివరాలు 

పీఎంఏవై-యు 2.0 అమలుపై సీఎస్‌ఎంసీ సూచనలు

రాష్ట్రానికి గతంలో రూ.233.80 కోట్ల కేంద్ర సాయం మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.41.85కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులను వేగంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2026 మార్చి నాటికి 1.20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 45,230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు పంపిందని పేర్కొంది. మిగిలిన ఇళ్లకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటివరకు మంజూరైన ఇళ్లలో 16,283 ఇళ్లకు (సుమారు 35 శాతం) మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపింది. మిగిలిన ఇళ్ల పనులను తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని సూచించింది. 45,230 మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా,ఇప్పటివరకు 12,776 మందికి మాత్రమే నిధులు అందాయని వెల్లడించింది.

Advertisement

వివరాలు 

పీఎంఏవై-యు 2.0 అమలుపై సీఎస్‌ఎంసీ సూచనలు

బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (BLC) కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాన్ని 12 నుంచి 18 నెలల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. పథక మార్గదర్శకాల ప్రకారం నిర్మాణ పురోగతి వివరాలను సమర్పించిన తర్వాత మాత్రమే రెండో, మూడో విడత కేంద్ర నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేసింది. బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణం పూర్తికాకముందే ఆయా కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక పౌర సౌకర్యాలు కల్పించాలని, అనంతరం మాత్రమే మూడో విడత నిధులు కోరాలని సూచించింది. ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ప్రాధాన్య క్రమంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆదేశించింది. పీఎంఏవై-యు 2.0 మార్గదర్శకాల ప్రకారం 'అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ'ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని సూచించింది.

Advertisement

వివరాలు 

పీఎంఏవై-యు అమలుపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు

కేంద్రం విడుదల చేసిన నిధుల్లో మిగిలిన మొత్తంతో పాటు, ట్రెజరీలో మిగిలి ఉన్న రూ.121.71 కోట్ల కేంద్ర సాయాన్ని భారత సంఘటిత నిధిలో జమ చేసి, ప్రస్తుతం ఉన్న సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA) ఖాతాను మూసివేయాలని ఆదేశించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏ స్పర్స్ ఖాతాను మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్రంలో 3,71,382 బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపింది. ఈ ఇళ్లకు కేంద్ర సాయం అందదని, ఇప్పటికే విడుదల చేసిన నిధులను భవిష్యత్‌లో ఇవ్వాల్సిన కేంద్ర సాయానికి సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.

వివరాలు 

పీఎంఏవై-యు అమలుపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు

అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న 20,400 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని సూచించింది. అలాగే 1,10,495 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ప్లింత్ లెవల్ వరకు చేరిన 4.13 లక్షల బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణాన్ని పథకం గడువు ముగిసేలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ పథకం కింద ఇప్పటికీ రూ.1,170.95 కోట్ల నిధులు ఖర్చు కాకుండా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే రూ.353.28 కోట్ల వ్యయానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (UCలు) పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే సమర్పించాలని ఆదేశించింది.

Advertisement