Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం.. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రం అనుమతి నిరాకరించడంతో లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాసింది.
వివరాలు
రాజకీయ కోణంలో అనుమతి నిరాకరణ: సీఎం రేవంత్‌రెడ్డి
అయితే కేంద్ర విదేశాంగశాఖ యూకే పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించింది.
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు.
రాజకీయ కారణాలతో విదేశీ పర్యటనను అడ్డుకోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
కేంద్ర నూతన విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం తన లక్ష్యమని సీఎం తెలిపారు.
రాష్ట్రానికి అత్యుత్తమ విద్యాసంస్థలను తీసుకురావడంతో పాటు ప్రపంచస్థాయి సంస్థలను తెలంగాణకు ఆకర్షించడమే అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని వివరించారు.
తన విదేశీ పర్యటన వికసిత్ భారత్ నిర్మాణానికి కూడా దోహదపడుతుందని భావించినట్లు చెప్పారు.
వివరాలు
అధికారుల బృందానికి సీఎం కీలక ఆదేశాలు
దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అమెరికా పర్యటనకు తాను వెళ్లలేకపోయినా.. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, సమావేశాలను కొనసాగించాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఇప్పటికే ఖరారైన అన్ని ఎంవోయూలను యథాతథంగా పూర్తి చేయాలని సూచించారు.
అలాగే వివిధ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య ఒప్పందాలను కూడా ఖరారు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
లండన్‌లో కొనసాగుతున్న సీఎం పర్యటన
రెండ్రోజుల క్రితం దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా లండన్ చేరుకున్నారు.
ప్రస్తుతం ఆయన యూకే పర్యటనలో ఉన్నారు. ఈ రోజు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సీఎం సందర్శించనున్నారు.
అనంతరం సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం సమావేశం కానున్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శిస్తారు.
సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 23న లండన్ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.