Loading...
ISRO: ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం
ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం

ISRO: ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్రోలో కీలక అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా గగన్‌యాన్‌తో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక మిషన్లపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)దరఖాస్తుల ఆమోద ప్రక్రియపై కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. జులై 14న జారీ చేసిన అంతర్గత మెమో ప్రకారం,గగన్‌యాన్‌ సహా ఇతర కీలక ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్న గ్రూప్‌-ఏ శాస్త్ర,సాంకేతిక సిబ్బంది సమర్పించే రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణ పద్ధతిలో ఆమోదించకూడదని స్పష్టం చేసింది. సంబంధిత ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అలాంటి దరఖాస్తులను ఆయా కేంద్రాల డైరెక్టర్లు నేరుగా ఆమోదించకుండా,తమ సిఫార్సులతో పాటు కేంద్ర అంతరిక్ష శాఖకు పంపాలని ఆదేశించింది.

వివరాలు 

కీలక ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టిన కేంద్రం

తుది నిర్ణయం మాత్రం కేంద్ర మంత్రిత్వ శాఖే తీసుకోనుంది.

ఇటీవలి కాలంలో ఇస్రోలో రాజీనామాల సంఖ్య పెరిగిన విషయాన్ని అంతరిక్ష శాఖ పరోక్షంగా అంగీకరించింది.

అయితే అధికారికంగా ఎంతమంది ఉద్యోగులు సంస్థను వీడారన్న వివరాలను వెల్లడించలేదు.

'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం,ఇప్పటివరకు సుమారు 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులు రాజీనామా చేసినట్లు సమాచారం.

వారిలో యూఆర్‌ఎస్‌సీ (URSC)నుంచి దాదాపు 80మంది,వీఎస్‌ఎస్‌సీ (VSSC) నుంచి కనీసం 20మంది ఉన్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేసిన వారిలో ఎల్‌వీఎం-3 (LVM3) ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పాడెక్స్ (SpaDeX) ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో పాటు చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన ఓ యువ శాస్త్రవేత్త కూడా ఉన్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటామన్న ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్

ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ,రాజీనామాలు జరుగుతున్న విషయం వాస్తవమేనని చెప్పారు.

అయితే ఇలాంటి పరిస్థితులు ప్రతి పెద్ద సంస్థలోనూ కనిపిస్తాయని పేర్కొన్నారు.

కీలక ప్రాజెక్టుల పనితీరు ఒక్కసారిగా దెబ్బతినకుండా ఉండేందుకే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎవరైనా ఉద్యోగాన్ని వీడితే వారి బాధ్యతలను ఇతర శాస్త్రవేత్తలు చేపడతారని,ప్రాజెక్టుల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇస్రో చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ప్రస్తుతం ఇస్రోలో 14,600మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అయినప్పటికీ రాజీనామా చేస్తున్న వారిలో కీలక అంతరిక్ష మిషన్లకు చెందిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఉండటమే సంస్థకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలను సంబంధిత కేంద్రాల డైరెక్టర్లే ఆమోదించాలీ

చంద్రయాన్-3 విజయానికి కీలకమైన ల్యాండింగ్ ప్రక్రియ ధ్రువీకరణ కోసం లక్షకు పైగా పరీక్షలు నిర్వహించి, సుమారు 25 టెరాబైట్ల డేటా సిద్ధం చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి కూడా సంస్థను వీడినట్లు సమాచారం.

ఇంతకుముందు 2020లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలను సంబంధిత కేంద్రాల డైరెక్టర్లే ఆమోదించే అధికారం కలిగి ఉండేవారు.

అయితే తాజా ఆదేశాలతో గగన్‌యాన్‌తో పాటు ఇతర కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల విషయంలో ఆ అధికారాన్ని కేంద్ర అంతరిక్ష శాఖ తన పరిధిలోకి తీసుకుంది.

అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను భర్తీ చేయడం కొత్త నియామకాలు చేపట్టినంత సులభం కాదనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT