Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని పేర్కొంది. రాబోయే ఐదురోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు అధికంగా ఉండే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్,ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో పశ్చిమ మధ్య అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది. ఈఅల్పపీడనానికి అనుబంధంగా చక్రవాతపు ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి రాబోయే 24గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.