Page Loader
Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 
ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం

Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజున స్వామివారు భక్తులకు నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న సింహగిరిలోని దేవస్థానంలో తొలి గంధం తయారీకి శుభారంభం చేయనున్నారు. ఉదయం 6.30 గంటలకు అర్చకులు చందనం తయారీకి ముహూర్తం నిర్ణయించినట్లు ఈవో సుబ్బారావు వెల్లడించారు. అదే రోజు ఉదయం 7.30 తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులోకి రానున్నది.

వివరాలు 

 120 కిలోల చందనాన్ని స్వామికి అంకితం 

చందనోత్సవం సందర్భంగా వైశాఖ శుద్ధ తదియన స్వామివారి నిజరూప దర్శనం అనంతరం, తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు మణుగులు అంటే సుమారుగా 120 కిలోల చందనాన్ని అంకితమిస్తారు. ఈ చందనాన్ని ఆలయంలోని బేడామండపంలో సానలపై అర్చకులు అరగదీస్తారు. తరువాత, ఆ గంధంలో సుగంధ ద్రవ్యాలు కలిపి, ఈ నెల 30న రాత్రి సహస్ర ఘటాభిషేకం ముగిసిన తర్వాత స్వామివారికి అర్పణ చేస్తారు. ఈ కార్యక్రమం తరువాత కూడా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణముల సందర్భాల్లో మిగిలిన మూడు విడతలుగా చందన సమర్పణ జరుగుతుంటుంది. చివరగా శ్రావణ పౌర్ణమికి కరాళ చందన అలంకరణతో ఈ ఉత్సవం ముగియనుంది.

వివరాలు 

దర్శనానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు

స్వామివారి నిజరూప దర్శన దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనుంది. ఇందుకోసం దేవాదాయశాఖ కార్యదర్శి రూ.20,000మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకోనున్నారని అధికారులు తెలిపారు. ఈసారి నిజరూప దర్శనానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు,ఇతర ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈఏడాది ప్రత్యేకతగా,ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.