Kakinada: కాకినాడ నర్సింగ్ కాలేజీ ఘటనపై చంద్రబాబు ఆరా.. రంగంలోకి కలెక్టర్, ఎస్పీ
ఈ వార్తాకథనం ఏంటి
కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినుల మధ్య జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విద్యార్థినుల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఎదురైనా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
వివరాలు
అసలు ఏం జరిగింది?
ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినుల మధ్య ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. తన మొబైల్ ఫోన్ కనిపించడం లేదంటూ మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.
ఆ తర్వాత ఫోన్ లభించినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. దీంతో ఏపీ, మణిపూర్‌కు చెందిన విద్యార్థినులు పరస్పరం ఘర్షణకు దిగారు.
ఈ ఘటనలో పలువురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో.. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.