
కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కుప్పంలో తన పర్యటనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్ జగన్ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై స్పందించిన చంద్రబాబు.. టీడీపీ సమావేశాలకు రాకుండా చేసే కుట్రల్లో భాగంగానే అవి జరిగాయన్నారు.
సీఎం జగన్
'నేను తల్చుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?'
తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్ర చేశారన్నారు. వారి పాదయాత్ర కోసం తాను భద్రత కూడా కల్పించానన్నారు. తాను తల్చుకుంటే నాడు జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలోనే తనను అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.
కందుకూరు, గుంటూరు ఘటనల అనంతరం రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. అయినా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబుకు పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.