Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయేలో టీడీపీ చేరే విషయంపై సరైన సమయంలో మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే కూటమిలో చేరే ప్రణాళిక గురించి విలేకరి అడిగినప్పుడు, 'ఇది సరైన సమయం కాదు' అంటూ చంద్రబాబు దాటవేశారు.తగిన సమయం వచ్చినప్పుడు దీనిపై మాట్లాడతానని ఆయన అన్నారు. వైజాగ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన అనంతరం చంద్రబాబు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
2024లో జాతీయ రాజకీయాల్లో నా పాత్ర ఉంటుంది: చంద్రబాబు
2024లో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తన మొదటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ అని, రాష్ట్ర పునర్నిర్మాణానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతి రాజధాని అంశంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం తాము కట్టిన బిల్డింగ్స్‌లోనే సీఎం జగన్ కేబినెట్ మీటింగ్‌లు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గత పదేళ్లుగా పనిచేస్తున్నప్పుడు, ఆవి తాత్కాలిక బిల్డింగులు ఎలా అవుతాయన్నారు. హైదరాబాద్‌లాగే అమరావతి అభివృద్ధిని కూడా క్రమపద్దతిలో ప్లాన్ చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించడంతో ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. వాస్తవానికి ఎన్డీయే కూటమి వ్యవస్థాపకుల్లో చంద్రబాబు ఒకరు.