Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అసత్య సమాచార వ్యాప్తిపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అవమానకర వీడియోలు, పోస్టులు ప్రచారం కావడంపై మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడం ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు
ఈ సందర్భంగా వైకాపా నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నేతలు సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అయితే, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా కులపరమైన అంశాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడం ఆందోళన కలిగిస్తోందని సీఎం పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను అడ్డుపెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నియంత్రణ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
వివరాలు
వాట్సాప్‌లో యూజర్ నేమ్ సదుపాయం అందుబాటులోకి వస్తే..
సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను సమర్థంగా అరికట్టేందుకు హోంశాఖ, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వాట్సాప్‌లో యూజర్ నేమ్ సదుపాయం అందుబాటులోకి వస్తే సోషల్ మీడియాకు సంబంధించిన సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని డీజీపీ హరీశ్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కార చర్యలను మరింత బలోపేతం చేయడానికి ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.