Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఇవాల దర్శించుకున్నారు. అంతకుముందు, శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పౌర విమానయాన శాఖ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్ఐసీసీఐ భాగస్వాములుగా ఉన్నారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు 'సీ ప్లేన్' ను ప్రారంభించి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీశైలం వరకు ప్రయాణించారు. పాతాళగంగలో సురక్షితంగా ల్యాండ్ అయిన సీ ప్లేన్‌కు ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.
సీఎంకు ఘన స్వాగతం
రాష్ట్ర మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం, పాతాళగంగ నుంచి చంద్రబాబు రోప్ వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం స్వీకరించారు.