Flight Crash: భువనేశ్వర్ సమీపంలో కూలిన చార్టర్ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురై కూలిపోయింది. ఇండియావన్ ఎయిర్ యాజమాన్యానికి చెందిన ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో కూలినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడం ఊరట కలిగించే విషయం. అయితే పైలట్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూర్కెలా నుంచి సుమారు 10నుంచి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు.
Details
ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు
ఘటనపై సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులందరినీ స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విమానంలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవతో పాటు నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.