
G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.
దిల్లీ నిర్వహిస్తున్న ఈ హై-ప్రొఫైల్ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లును చేసింది. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలను విధించింది.
ముఖ్యంగా ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక రెగ్యులేటరీ జోన్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జీ20 సదస్సు వేళ.. దిల్లీలో విధించిన ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుంచే నిర్దేశిత ప్రాంతాల్లో దిల్లీలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ పైనే ఆంక్షల ప్రభావం పడనుంది. నార్తర్న్ జోన్‌లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
దిల్లీ
థియేటర్లు, రెస్టారెంట్లు బంద్
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జీ20 సమ్మిట్ నిర్వహిస్తారు. దీంతో దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ రెండు రోజులు సెలవు ప్రకటించారు.
అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరిగే అవకాశం ఉన్న కొన్ని సున్నితమైన ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భద్రతపై నిఘా పెట్టనున్నారు.
జీ20 సమ్మిట్ జరిగే రోజుల్లో దిల్లీలోని ఏ మార్కెట్ కూడా మూసివేయబడదని స్పెషల్ సీపీ(ట్రాఫిక్) సురేందర్ యాదవ్ తెలిపారు.
నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నన్ని రోజులు దిల్లీలోని అన్ని థియేటర్లు, రెస్టారెంట్లు మూసివేసి ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా క్లౌడ్ కిచెన్‌లు, డెలివరీ సేవలకు కూడా అనుమతి లేదన్నారు.
దిల్లీ
తెరుచుకునేవి ఇవే..
కిరాణం దుకాణాలు, ఏటీఎంలు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలు అందించే సంస్థలు తెరిచి ఉంటాయని సురేందర్ యాదవ్ వెల్లడించారు.
కొంతమంది దేశాధినేతలు సాకేత్‌లోని మౌర్య షెరటన్ హోటల్, లోధి హోటల్, రింగ్ రోడ్‌లోని హయత్‌లో బస చేస్తారని యాదవ్ చెప్పారు. ఇవన్నీ ఎన్‌డీఎంసీ పరిధిలో ఉన్నాయని, ఇవి సాధారణంగానే పనిచేస్తాయని చెప్పారు.
అయితే ప్రముఖుల ప్రయాణాలు ఉన్నప్పుడు 5స్టార్ హోటళ్ల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పారు.
అలాగే నిర్దేశిత ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో అన్ని మాల్స్, హోటళ్లు సాధారణంగా పనిచేస్తాయని చెప్పారు.
నియంత్రిత జోన్‌లో కార్లు, సైకిళ్లు, ఇతర వాహనాలకు అనుమతి లేదని సురేందర్ యాదవ్ వివరించారు. సమ్మిట్ వ్యవధిలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లవద్దని సూచించారు.