China Dam: చైనా మౌనం.. నేపాల్ వరదల నుంచి భారత్‌కు పొంచి ఉన్న పెను ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
హిమాలయ దేశం నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు సమాచార లోపం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టిబెట్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడటం, దాంతో వరదలు వచ్చే అవకాశం గురించి చైనాకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ.. తమను అప్రమత్తం చేయలేదని నేపాల్ ఆరోపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఇలాంటి అత్యవసర సమాచారాన్ని తప్పనిసరిగా పంచుకునే అధికారిక ఒప్పందం లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే నేపాల్‌లో జరిగిన ఘటన భారత్‌కూ ఓ హెచ్చరికగా మారింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ కారణంగా భవిష్యత్తులో ఈశాన్య రాష్ట్రాలకు ఇలాంటి ముప్పే ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
వరదలు వచ్చాక చైనా సమాచారం..
నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటల సమయంలో టిబెట్‌లోని కెరుంగీ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఈ ఘటన జరిగిన సుమారు 45 నిమిషాల తర్వాతే నేపాల్‌కు అక్కడ వరదలు వచ్చిన విషయం తెలిసింది.
అంతకుముందే సమాచారం ఉన్నప్పటికీ చైనా అధికారులు నేపాల్‌ను అప్రమత్తం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
కెరుంగీ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు నేపాల్ వైపు వస్తున్నట్లు కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంటనే సహాయక చర్యలకు సిద్ధమయ్యేలోపే వరదనీరు నేపాల్‌లోని పలు జిల్లాలను ముంచెత్తింది.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చైనా నుంచి నేపాల్‌కు అధికారిక సమాచారం అందింది.
వివరాలు
వరదలు వచ్చాక చైనా సమాచారం..
టిబెట్ వైపు నదిలో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోషీ, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడిందని ఆ సమాచారంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
టిబెట్‌లో వరద పరిస్థితిపై బీజింగ్‌కు ముందే అవగాహన ఉన్నప్పటికీ.. దాన్ని సకాలంలో నేపాల్‌కు తెలియజేయకపోవడం వల్లే నష్టం మరింత పెరిగిందని నేపాల్ వాదిస్తోంది.
అయితే ఈ ఘటనకు చైనాను నేరుగా బాధ్యురాలిని చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
అత్యవసర సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంపై ఇరు దేశాల మధ్య నిర్దిష్ట ఒప్పందం లేకపోవడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు.
వివరాలు
భారత్‌కూ 'మెగా' ముప్పు..
నేపాల్ ఘటన ఇప్పుడు భారత్‌లోనూ ఆందోళనకు కారణమవుతోంది.
దీనికి ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపడుతున్న భారీ డ్యామ్ నిర్మాణం.
నదీజలాలపై వివాదాలను పరిష్కరించేందుకు భారత్, చైనా మధ్య ప్రత్యేకమైన ఒప్పందాలు, శాశ్వత యంత్రాంగం లేవు.
అయితే బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహంలో మార్పులు, నీటి బాష్పీభవనం, వర్షపాతం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ఇరు దేశాల మధ్య ఓ అవగాహనా ఒప్పందం ఉంది.
ఈ ఒప్పందాన్ని ప్రతి అయిదేళ్లకోసారి పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. చైనా డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ అవగాహనా ఒప్పందాన్ని బీజింగ్ పునరుద్ధరించకపోతే.. అది భారత్‌కు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
వివరాలు
భారత్‌కూ 'మెగా' ముప్పు..
అంతేకాదు.. డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం ప్రకృతి విపత్తులకు కూడా అత్యంత సున్నితమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు.
భవిష్యత్తులో టిబెట్ వైపు బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు.. ఆ సమాచారాన్ని చైనా భారత్‌కు సకాలంలో అందించకపోతే దాని ప్రభావం నేరుగా ఈశాన్య రాష్ట్రాలపై పడే ప్రమాదం ఉంది.
ఆకస్మికంగా భారీగా నీరు దిగువకు రావడం వల్ల పెద్దఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉంటుంది.
వివరాలు
డ్యామ్ కింద 'ఫాల్ట్'..
బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ జాంగ్బోగా పిలుస్తారు.
ఈ నదిపైనే చైనా సుమారు 167బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో భారీ జలవిద్యుత్తు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
ఇందులో భాగంగా భారీ డ్యామ్‌ను ఏర్పాటు చేయనుంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద త్రీగోర్జెస్ డ్యామ్‌తో పోలిస్తే.. ఈ ప్రాజెక్ట్ పరిమాణం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండనుంది.
బ్రహ్మపుత్ర నది 'గ్రేట్ బెండ్'గా పిలిచే ప్రాంతంలో సుమారు 2,000మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది.
తక్కువ దూరంలోనే ఇంతటి ఎత్తు నుంచి నీరు కిందకు పడటం వల్ల అక్కడ భారీ స్థాయిలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని చైనా భావిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలమని చైనా చెబుతోంది.
వివరాలు
డ్యామ్ కింద 'ఫాల్ట్'..
అయితే ఈ భారీ నిర్మాణం చేపడుతున్న భౌగోళిక ప్రాంతమే ఇప్పుడు భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది.
చైనా జియలాజికల్ సర్వే పర్యవేక్షణలో కొంతకాలం క్రితం జరిగిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్న ప్రాంతం అడుగునే 'పైజెన్ ఫాల్ట్' ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
ఈ భౌగోళిక పగులు అక్కడి రాతి నిర్మాణాలను ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.
ఈ ఫాల్ట్ ప్లిస్టోసీన్ లేదా మంచుయుగం కాలం నుంచే చురుగ్గా ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నట్లు సమాచారం.
ఇలాంటి భౌగోళిక పగుళ్ల కారణంగా డ్యామ్‌లతో పాటు రహదారులు, వంతెనలు, సొరంగాలు వంటి కీలక మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
విలయం.. లేదంటే కరవు..
ఈప్రాంతంలో భూకంపం సంభవిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చని వారు చెబుతున్నారు.
భారీ డ్యామ్ ఉన్న ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు దాని ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయడం కూడా కష్టంగా మారుతుందని వివరిస్తున్నారు.
బ్రహ్మపుత్ర నదిపై భారత్‌లో కోట్లాది మంది ప్రజల జీవనాధారం ఆధారపడి ఉంది.
ముఖ్యంగా అస్సాం,అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలకు ఈ నది అత్యంత కీలకం. అయితే సాధారణ పరిస్థితుల్లోనే బ్రహ్మపుత్ర వరదల కారణంగా ప్రతి ఏటా ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్ పూర్తయిన తర్వాత భారత్,చైనా మధ్య ఏదైనా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి.. డ్యామ్ నుంచి ఒక్కసారిగా అపారమైన నీటిని దిగువకు విడుదల చేస్తే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశంఉంది.
వివరాలు
విలయం.. లేదంటే కరవు..
భారీగా ప్రవహించే నీరు ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసకర వరదలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
మరోవైపు డ్యామ్ కారణంగా బ్రహ్మపుత్రలో సహజ నీటి ప్రవాహం తగ్గినా సమస్య తప్పదు.
చైనా దిగువ ప్రాంతాలకు తగినంత నీటిని విడుదల చేయకపోతే.. నదిలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది.
దాని ప్రభావం సాగునీరు, తాగునీటిపై పడవచ్చు. అంటే ఒకవైపు అకస్మాత్తుగా వచ్చే భారీ వరద ముప్పు.. మరోవైపు నీటి కొరత రూపంలో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు
విలయం.. లేదంటే కరవు..
అందుకే భారత్ కూడా ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమవుతోంది.
చైనా మెగా డ్యామ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి దిగువకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
దీంతో చైనా డ్యామ్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆకస్మిక నీటి ప్రవాహం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు కొంత రక్షణ లభించే అవకాశం ఉంది.