దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జీ20 సమావేశంలో చైనా హాజరుపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై జీ20 దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్థిక వ్వవస్థపై ప్రపంచ దేశాలకు సానుకూల సంకేతాలు పంపేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు మావో నింగ్ వివరించారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావాలని భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఇప్పటికే కిన్ గాంగ్‌కు ఆహ్వానం పంపారు.
సమావేశాలకు జపాన్ దూరం
తూర్పు లద్ధాఖ్‌లోని సరిహద్దు వద్ద చైనా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జూన్, 2020లో తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల పరిస్థితి ఉప్పూ-నిప్పూలా మారింది. అయితే సరిహద్దు వద్ద సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి, తీవ్రతను తగ్గించడానికి, ఇరు పక్షాలు దృష్టి సారించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆ దేశ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మీటింగ్‌కు జపాన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.