The Wall Street Journal: చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది. చైనా ల్యాబ్ జరిగిన ప్రమాదం వల్లే కరోనా ఉద్భవించి ఉండవచ్చని ఈ మేరకు ఎనర్జీ డిపార్ట్‌మెంట్ అభిప్రాయానికి వచ్చింది. దీనికి సంబంధించి ఐదు పేజీల రిపోర్టును తయారు చేసింది. వాస్తవానికి గతంలో కూడా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కరోనా పుట్టుక గురించి పరిశోధన చేసింది. కానీ నిర్దిష్టంగా అప్పుడు చెప్పలేకపోయింది. అయితే తాజాగా చేసిన పరిశోధన చాలా కచ్చితత్వంతో చేసి, వైట్ హౌస్‌కు నివేదికను సమర్పించింది.
ఎనర్జీ డిపార్ట్‌మెంట్ అత్యున్నతస్థాయి నిపుణులు ఉండే ఏజెన్సీ
ఎనర్జీ డిపార్ట్‌మెంట్ అనేది అమెరికాలో జాతీయ ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. అధునాతన జీవ పరిశోధనలను కూడా అది పరిశీలిస్తోంది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నతస్థాయి నిపుణులు ఉంటారు. ఈ నేపథ్యంలో అంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థ ఇచ్చిన రిపోర్టు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకున్నది. 2021లో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కరోనా వైరస్ పుట్టుక చైనాలో జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. అది ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నది. ఇదిలా ఉంటే, మూడు సంవత్సరాల క్రితం ఉద్భవించిన కరోనా కారణంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది అమెరికన్లు మరణించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.