హవాయి: అమెరికా గగనతలంలో మరో 'స్పై బెలూన్'- చైనా పైనే అనుమానాలు
అమెరికా హవాయిలోని హోనోలులు గగనతలంలో పెద్ద తెల్లటి బెలూన్ కనిపించినట్లు కనిపించింది. ఇటీవల చైనాకు చెందిన పలు స్పై బెలూన్లను అమెరికా బలగాలు పేల్చేసిన కొద్దిరోజుల తర్వాత, ఇది తాజాగా దర్శనమివ్వడం గమనార్హం. సోమవారం హవాయిలోని హోనోలులుకు తూర్పున ఒక పెద్ద తెల్లటి బెలూన్ కనిపించినట్లు ఫోక్స్ న్యూస్ నివేదించింది. హోనోలులుకు తూర్పున దాదాపు 500 మైళ్ల దూరంలో గల ప్రాంతం గగనతలంపై దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ బెలూన్ 40,000నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హవాయి రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా స్పై బెలూన్‌ను ఇటీవల అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇప్పుడు తాజాగా మరోసారి బెలూన్ కనిపించడంపై అమెరికా అధికారులు ఆలోచనలో పడ్డారు.
అది ఎవరిదో తెలిస్తేనే ప్రమాద తీవ్రతను అంచనా వేయగలం: అమెరికా
తాజాగా కనిపిస్తున్న స్పై బెలూన్ చాలా ఎత్తులో ఉండటం వల్ల దాని గురించి ఏం చెప్పలేకపోతున్నామని అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య విమానాలను నడిపే పైలెట్లు మాత్రం ఒక వస్తువు ఎగురుతున్నట్లు మాత్రం నిర్ధారించారు. ఎగురుతున్న తెల్లటి బెలూన్ ఎఫ్ఎల్400- ఎఫ్ఎల్500 మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దాని గురించిన సమాచారం తెలిస్తే ఏటీసీ సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ వస్తువు ఎవరికి చెందినదో తెలిస్తే, దాన్ని ప్రమాద తీవ్రతను అంచనా వేయవొచ్చని అధికారులు స్పష్టం చేశారు.