వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా
భారతీయులకు వీసాలు జారీ అంశంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాల జారీ విషయంలో భారత్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్ సుమారు 36 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్‌లోని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ వీసాల జారీపై మాట్లాడారు. అలాగే వీసాల కోసం వేచి ఉండే సమయంలాన్ని కూడా చాలా వరకు తగ్గించినట్లు జూలీ వివరించారు. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 36శాతం ఎక్కువ వీసాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అమెరికా, భారత ప్రజల మధ్య బలమైన సంబంధాలు: అమెరికా
హెచ్-1, ఎల్-1 వీసాల జారీతో పాటు పునరుద్ధరణ కోసం అమెరికాలో వీసా స్టాంపింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు స్టఫ్ట్ ప్రకటించారు. పైలట్ ప్రాతిపదికన కొన్ని కేటగిరీల్లో దేశీయ వీసా రీవాలిడేషన్‌ను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. హెచ్1బీ, 'ఎఫ్' వీసాల కోసం నిరీక్షణ సమయం దాదాపు ఆరు నెలల క్రితం ఎక్కువగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు చాలా వరకు తగ్గినట్లు వివరించారు. అమెరికా, భారత ప్రజల మధ్య అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయని డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ నాన్సీ జాక్సన్ పేర్కొన్నారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించడానికి కృషి చేస్తామని వెల్లడించారు.