రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్; భారత్, చైనా దూరం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి శుక్రవారం(ఫిబ్రవరి 24) నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రష్యా యుద్ధాన్ని ఆపేసి ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్‌లో భారత్- చైనా దూరంగా ఉన్నాయి. 193 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితిలో 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానాన్ని 7దేశాలు వ్యతిరేకించాయి. భారత్, చైనా సహా 32 దేశాలు ఓటింగ్‌కు గైర్జాజరయ్యాయి.
ఉక్రెయిన్‌లో శాంతికోసం దౌత్యపరమైన ప్రయత్నాలు రెట్టింపు: ఐక్యరాజ్యసమితి
చర్చల ద్వారా మాత్రమే ఉక్రెయిన్- రష్యా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ మొదటి నుంచి విశ్వసిస్తోంది. గతంలో కూడా ప్రధాని మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అందుకే గతంలో ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా పలుమార్లు ఓటింగ్ జరగ్గా, భారత్ చాలా వరకు దూరంగా ఉంది. ఐక్యరాజ్యసమితి సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని వీలైనంత త్వరగా నెలకోల్పాలని తాజాగా ఐక్యరాజ్యసమితిలో చేసిన తీర్మానం స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్‌లో శాశ్వతమైన శాంతిని సాధించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలకు రెట్టింపు మద్దతు ఇవ్వాలని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలకు ఐక్యరాజ్యసమితి సూచించింది.