'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రహస్య పర్యటనపై రష్యా స్పందించింది. బైడెన్ తమ నుంచి భద్రతా పరమైన హామీని అందుకున్న తర్వాతే ఉక్రెయిన్‌కు బయలుదేరినట్లు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు. అయితే బైడెన్‌కు ఎవరు హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం మెద్వెదేవ్ పేర్కొనలేదు. మెద్వెదేవ్ సోమవారం తన టెలిగ్రామ్ ఛానెల్‌లో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన గురించి రాసుకొచ్చాడు. బైడెన్ పర్యటన గురించి బయటికి తెలియగానే, ఇది మాస్కోకు ముందే తెలుసుననే ప్రచారం జరిగింది. అయితే దీనిపై వైట్‌హౌస్ గానీ, రష్యా గానీ స్పందించలేదు. తాజాగా రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ స్పందించి, ఏకంగా తాము హామీ ఇచ్చిన తర్వాతే బైడెన్ వెళ్లాడని చెప్పడం గమనార్హం.
ఉక్రెయిన్‌కు 500 మిలియన్ల డాలర్ల సైనిక ప్యాకేజీ: అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో బైడెన్ పర్యటన ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తన మద్దతును ప్రకటించారు బైడెన్. ఉక్రెయిన్ పర్యటనలో బిడెన్ ఆ దేశం కోసం 500 మిలియన్ల డాలర్లను సైనిక సహాయ ప్యాకేజీ అందజేస్తానని ప్రకటించారు. జావెలిన్‌లు, హోవిట్జర్, ఫిరంగి మందుగుండు సామగ్రి అందజేయనున్నట్లు బైడెన్ చెప్పారు. అలాగే రష్యా కంపెనీలపై అదనపు ఆంక్షలను విధిస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు అమెరికా కట్టుబడి ఉందన్నారు.