ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోల్డోవా దేశంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ విదేశీ విధ్వంసకారులను ఉపయోగించి తమ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, తమను యూరోపియన్ యూనియన్‌లో చేరకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారని మోల్డోవన్ ప్రెసిడెంట్ మైయా సాండు చెప్పిన నేపథ్యంలో జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మోల్డోవా మిత్రదేశం కావడం వల్లే, పుతిన్ తర్వాతి టార్గెట్ ఈ దేశమనే ఊహాగానాలు వెలువడుతున్నయి.
మోల్డోవా ప్రజలకు అండగా ఉంటాం: అమెరికా
సైనిక శిక్షణ పొందిన వ్యక్తులతో తమ దేశంలో పుతిన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని మైయా సాండు చెప్పారు. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి దీనికి సంబంధించిన సమాచారం వచ్చినట్లు చెప్పారు. రష్యా కుట్రకు సంబంధించిన డాక్యుమెంట్‌ను ఉక్రెయిన్ పొందినట్లు మోల్డోవన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కూడా ధృవీకరించింది. అయితే దీనిపై స్పందించిన జాన్ కిర్బీ , ఆ డాక్యుమెంట్‌ను ధృవీకరించనప్పటికీ, పుతిన్ అలాంటి చర్యను ప్రయత్నించగలడని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే మోల్దోవన్ ప్రభుత్వం, ఆ దేశ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను రష్యా తిరస్కరించింది. ఆ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి తేల్చి చెప్పింది. రష్యా, మోల్డోవా మధ్య ఉద్రిక్తతను రేకెత్తించినందుకు ఉక్రెయిన్ ఈ వివాదాన్ని తెరపైకి వచ్చినట్లు చెప్పింది.