'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు
రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం నేపథ్యంలో గతంలో కూడా పలుమార్లు అమెరికా పౌరులను రష్యా విడిచి వెళ్లాలని యూఎస్ రాయబార కార్యాలయం హెచ్చరించింది. గతేడాది సెప్టెంబర్‌లో సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించిన సమయంలో రాయబార కార్యాలయం ఈ హెచ్చరికలు జారీ చేసింది.
ఏకపక్షంగా స్థానిక చట్టాలను ప్రయోగిస్తున్న రష్యా: అమెరికా
రష్యన్ భద్రతా సేనలు అమెరికా పౌరులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసినట్లు యూఎస్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఎలాంటి సాక్ష్యాలను సమర్పించకుండానే వారిని దోషులుగా నిర్ధారించినట్లు వివరించింది. ముఖ్యంగా అమెరికా పౌరులైన మత బోధకులను లక్ష్యంగా చేసుకొని ఏకపక్షంగా రష్యా సైనికులు స్థానిక చట్టాలను ప్రయోగిస్తున్నట్లు యూఎస్ ఆరోపిస్తోంది. గూఢచర్యం అనుమానంతో అమెరికా పౌరుడిపై రష్యా క్రిమినల్ కేసు పెట్టిందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ జనవరిలో తెలిపింది. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా రష్యా వదులుకోవడం లేదు. అందులో భాగంగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.