ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సందర్శించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన ఉక్రెయిన్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? అనేది ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే సాగింది. రష్యా కళ్లుగప్పి ఆ రహస్య పర్యటన ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు యూఎస్ మిలిటరీ నియంత్రణలో లేని వార్‌జోన్‌ను సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
బైడెన్ ఉక్రెయిన్ పర్యటన వెనుక కొన్ని నెలల కసరత్తు ఉందని వైట్‌హౌస్ పేర్కొంది. ఈ పర్యటనను అత్యంత రహస్యంగా నిర్వహించాలని ముందే అనుకున్నట్లు చెప్పింది.
ఈ పర్యటన కోసం వైట్‌హౌస్, జాతీయ భద్రతా ఏజెన్సీలోని సీనియర్ అధికారులు నెలల తరబడి పని చేసినట్లు భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.
బైడెన్
బైడెన్ పర్యటన సాగింది అలా..
వాషింగ్టన్ నుంచి ఆదివారం రాత్రి బైడెన్ బయలుదేరారు. C-32 అని పిలువబడే చిన్నపాటి ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 757ను తన రహస్య పర్యటనకోసం బైడెన్ ఉపయోగించారు.
విమానంలో బైడెన్‌తోపాటు కొద్దిమంది భద్రతా సిబ్బంది, చిన్న వైద్య బృందం, సన్నిహిత సలహాదారులు, ఇద్దరు జర్నలిస్టులను మాత్రమే తీసుకెళ్లారు. జర్నలిస్టుల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిఖీ, ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఆ సమయంలో వారి ఫోన్లను జప్తు చేశారు.
విమానంలో 7గంటలు ప్రాయాణించిన తర్వాత జర్మనీ రామ్‌స్టెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంలో ఇంధనం నింపుకున్నారు. అనంతరం పోలాండ్‌కు వెళ్లి అక్కడ ర్జెస్జో-జసియోంకా విమానాశ్రయంలో దిగారు.
అక్కడి నుంచి రైలు మార్గంలో దాదాపు 10గంటలు రాత్రిపూట ప్రయాణించి సోమవారం ఉదయానికి కీవ్‌కు బైడెన్ చేరుకున్నారు.