టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి
టర్కీలోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 213 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని సులేమాన్ తెలిపారు. టర్కీలో తాజాగా సంభవించిన భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4, 5.8 తీవ్రత నమోదైనట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ(ఏఎఫ్ఏడీ) వెల్లడించింది. రెండు వారాల క్రితం టర్కీ, సిరియాలో వరుసగా 40కిపైగా భూకంపాలు సంభవించగా, 46,000 మందికి పైగా మరణించారు. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ఒకవైపు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుండగానే మరో రెండు భూకంపాలు ఆ దేశాన్ని కుదిపేశాయి.
దెబ్బతిన్న భవనాలకు ప్రజలు దూరంగా ఉండండి: టర్కీ వైస్ ప్రెసిడెంట్
భూకంప ప్రభావిత ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న భవనాలకు ప్రజలు దూరంగా ఉండాలని టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే పిలుపునిచ్చారు. తాజాగా భూకంపాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేసర్ స్పందించారు. భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి అదనపు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యూఎన్ బృందాలు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు, యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా టర్కీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.