టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు. అంతకు ముందు రోజు ఎన్టీఆర్‌ఎఫ్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన స్నిఫర్ డాగ్స్ ఆరేళ్ల బాలికను రక్షించిన విషయం తెలిసిందే. తాజాగా టర్కీలోని గాజియాంటెప్‌లోని నూర్దగిలో నేలకూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని సజీవంగా కాపాడారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ఎఫ్ సైన్యం ట్వీట్ చేసింది. టర్కీలోని రెస్క్యూ ఆపరేషన్ల చిత్రాన్ని ఎన్టీఆర్‌ఎఫ్ ట్విట్టర్‌లో పంచుకుంది. ఇదిలా ఉంటే, 'ఆపరేషన్ దోస్త్' కింద టర్కీ, సిరియాకు భారత్ భూకంప సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బంది, నిత్యావసరాలు, వైద్య పరికరాలతో కూడిన ఆరు విమానాలను పంపింది.
గత రెండు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే
ఫిబ్రవరి 6న సంభవించిన వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మృతి చెందిన వారి సంఖ్య 24,000 దాటినట్లు ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది. గత రెండు దశాబ్దాల్లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని అధికారులు చెబుతున్నారు. అలాగే సహాయక చర్యలను వేగంవంతం చేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టర్కీలోని అడియామాన్ ప్రావిన్స్‌ను సందర్శించారు. అక్కడ అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ తమ వద్ద ఉన్నా, సహాయక చర్యలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఆయన అంగీకరిచారు.