LOADING...
AP Farmers: రైతులకు భారీ ఊరట.. 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్
రైతులకు భారీ ఊరట.. 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్

AP Farmers: రైతులకు భారీ ఊరట.. 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది రైతులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సాగు కాలం ప్రారంభానికి ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం రైతుల్లో ఆనందం నింపింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని, గరిష్టంగా రెండు నెలల్లోగా విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం అమలుకు సుమారు రూ.250కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని డిస్కంలకు స్పష్టమైన గడువు

అవసరమైన సదుపాయాల కోసం 10,000 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కూడా కేటాయించనున్నారు. ఈ అంశంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల గడువులోగా పెండింగ్‌లో ఉన్న అన్ని కనెక్షన్లను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అదనంగా 1.12 లక్షల కొత్త కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో మరో 46 వేల మందికి పైగా రైతులు వ్యవసాయ కార్యకలాపాల కోసం విద్యుత్ సదుపాయం పొందనున్నారు.

Advertisement