కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో చంద్రబాబు రోడ్‌షోలు, బహిరంగ సభలకు చిత్తూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అందరూ కొత్త ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వాస్తవానికి చంద్రబాబు మంగళవారం రాత్రి 10.30 గంటల వరకు పోలీసుల అనుమతి కోసం వేచిచూశారు. కానీ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
కుప్పం నియోజకవర్గంలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఎవరు నిర్వహించినా.. అందులో పాల్గొన్నా నిబంధనలను ఉల్లంఘించినట్లే పరిగణిస్తామని పలమనేరు డీఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబు
టీడీపీ గ్రామసభ
కొత్త ఉత్తర్వుల మేరకు పోలీసులు రోడ్‌షోలు, బహిరంగ సభలకు అనుమతి నిరాకరించడంతో.. టీడీపీ గ్రామ సభను చంద్రబాబు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి.. పలువురు మృతి చెందారు. కందుకూరులో 8మంది, గుంటూరులో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకవేళ.. రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలనుకుంటే.. అరుదైన సందర్భాల్లో.. షరతులతో కూడిన అనుమతి ఇస్తామని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.