Chandrababu: జొన్నగిరిలో బంగారం ఉత్పత్తికి శ్రీకారం.. గని ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన రెండో యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టులో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటివరకు రూ.405 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో, వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
వివరాలు
700మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉపాధి అవకాశాలు
ప్రైవేట్ రంగంలో బంగారం గనుల తవ్వకం,బంగారం ఉత్పత్తి ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో జొన్నగిరి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా బంగారం గనులు,ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రముఖ ప్రాంతాల సరసన నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందనుంది. జియో మైసూర్ సంస్థ ప్రతి ఏడాది రెండు టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ఈప్రాజెక్టు ద్వారా సుమారు 700మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఉత్పత్తి అయ్యే బంగారం విలువపై రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు శాతం రాయల్టీ అందనుంది. తొలి ఏడాదిలోనే సుమారు 400కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేస్తుండగా,దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.57కోట్ల మేర రాయల్టీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.