'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్ ప్రోటోకాల్స్, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి రిజర్వాయర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భూపేంద్ర యాదవ్‌కు వివరించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. కేఆర్‌ఎంబీ ఇండెంట్ లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తోందని జగన్ పేర్కొన్నారు
'అక్రమంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణం'
తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా నదిపై ఏపీ తన వాటా హక్కులను కోల్పోతోందని తన ఫిర్యాదులో పేర్కొనారు జగన్. 2022-23లో జూన్1 నుంచి ఖరీఫ్ సీజన్‌లో విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించడం తెలంగాణ ప్రారంభించిందని కేంద్రమంత్రికి జగన్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసం ఏటా 796 అడుగుల నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం కష్టతరంగా మారిందన్నారు జగన్. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే విషయంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నట్లు, ఇవీ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు జగన్.