Page Loader
వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్
తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని సీఎం జగన్ నిర్ణయం

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

వ్రాసిన వారు Stalin
Jan 06, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ చివరి వారంలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌ల పనితీరును పరిశీలించిన జగన్, ట్యాబ్‌లలో లోపాలు లేదా మరమ్మతులు ఉంటే సరిచేసి వారం రోజుల్లో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించాలని సూచించారు.

జగన్

'డీఎస్సీ -98 పోస్టింగ్‌లను త్వరగా పూర్తి చేయాలి'

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా‌కానుక కిట్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. డీఎస్సీ -98కి సంబంధించిన పోస్టింగ్‌లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గోరు ముద్ద (మధ్యాహ్న భోజనం) అమలులో భాగంగా అందిస్తున్న ఆహారం నాణ్యతపై దృష్టి సారించాలని సంబంధింత అధికారులు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మధ్యాహ్న భోజనానికి బలవర్ధక బియ్యాన్నే వినియోగించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బెల్లం కలిపిన రాగి మాల్ట్‌ను అందించాలన్నారు. నాడు-నేడు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.