12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత
కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మతం, కులాలు, భాషా భేదాలు ఉన్నా అందరూ ఐక్యంగానే ఉన్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మహిళా సాధికారత వల్లే ఈ అభివృద్ధి జరిగినట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు 'మీ ఇంటి వద్దే ప్రభుత్వం' (దువారే సర్కార్) కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
'దువారే సర్కార్'కు జాతీయ అవార్డు
బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న దువారే సర్కార్ కార్యక్రమం జాతీయ అవార్డును సైతం గెల్చుకున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రజల మధ్య విభజనను తాను నమ్మనని చెప్పారు మమత. ప్రపంచమంతా తన మాతృభూమి అని ఆమె అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ జాతీయంగా మందగించినప్పటికీ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో నాలుగు శాతం వృద్ధిని సాధించగలిగిందని ఆమె పేర్కొన్నారు. మూడు రోజుల పాటు బెంగాల్ జీ20 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.