Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్ కేంద్రానికి విజ్ఞప్తి
తెలంగాణలో వర్షాలు, వరదలు రాష్ట్రానికి భారీగా నష్టం మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సుమారు రూ.5,438 కోట్ల నష్టంపై నివేదిక అందించారు. వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. నష్టపరిహారం అందించాలన్న అభ్యర్థనతో రేవంత్ రెడ్డి ఈ నెల 2న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ పరిస్థితులపై వివరాలు చెప్పేందుకు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో, సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం హుటాహుటిన దిల్లీకి పయనమయ్యారు.
కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్ రెడ్డి
అమిత్ షాతో జరిగే ఈ సమావేశంలో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు, వరదలతో మిగిలిన అపార నష్టాన్ని వివరించనున్నారు. రోడ్లు, పంటలు, వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలను ఆయన అమిత్ షాకు వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వర్షాల కారణంగా మృతిచెందిన పశువులు, పక్షులు, కోళ్లకు కూడా పరిహారం చెల్లించాలని, రాష్ట్రంలో భారీ నష్టం నేపథ్యంలో, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం అందించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోతే, సీఎం రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నట్లు సమాచారం.