Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
తెలంగాణ విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు జరిగినట్టు మీరు భావిస్తే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు. దీంతో జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన సీఎం రేవంత్, అసెంబ్లీ వేదికగా మూడు అంశాలపై ఎంక్వైరీ వేయిస్తామన్నారు, విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, మీ ఉద్దేశాలు ఏమిటో విచారణలో వెల్లడవుతాయన్నారు.
రెండో భద్రాద్రి, మూడోది యాదాద్రి పవర్ ప్రాజెక్ట్
ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణను మొదటిఅంశంగా ఆదేశిస్తున్నామన్నారు. కేంద్రం తక్కువ ధరకే నాణ్యత విద్యుత్ అందిస్తున్నా అధిక ధరకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇక రెండో అంశంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. కరెంట్ సెంటిమెంట్ అంశాన్ని గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని రేవంత్ మండిపడ్డారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుపై గతంలో ప్రశ్నించిన తమను మార్షల్స్ చేత సభ బయటకు గెంటించారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో పని చేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. 24గంటల విద్యుత్ పంపిణీ చేశామంటున్నారని, అవన్నీ అబద్ధాలేనన్నారు.