కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
శాసనసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 5 ప్రధాన హామీలపై మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య స్వయంగా ప్రకటన చేశారు. గృహ జ్యోతి, అన్న భాగ్య, శక్తి, యువనిధి, గృహలక్ష్మి పథకాల అమలుకు స్టేట్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కర్ణాటక వాసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కులాలకు, మతాలకు సంబంధం లేకుండా, అంతరాలు చూపకుండా ఈ 5 కీలకమైన పథకాలను వెంటనే అమల్లోకి తెస్తామన్నారు. ఫలితంగా కన్నడ రాష్ట్ర సర్కారు ఖజానాపై ప్రతీ సంవత్సరం దాదాపుగా రూ.50 వేల కోట్ల అదనపు భారీం పడనుంది.
అన్నభాగ్య, గృహజ్యోతి, శక్తి, యువనిధి, గృహలక్ష్మిలకు ఆమోదం
అన్నభాగ్య పథకం కింద బీపీఎల్ లోని ప్రతీ వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యాన్ని అందజేస్తామన్నారు. శక్తి పథకం కింద కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేయవచ్చన్నారు. ఇంటింటికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయిన గృహ జ్యోతి పథకాన్ని జులై 1 నుంచి అమలు చేస్తామన్నారు. జులై వరకు ఉన్న విద్యుత్ బకాయిలు ప్రజలే చెల్లించాలని సూచించారు. 'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సీఎం వివరించారు. 2022-23లో పాసైన పట్టభద్రులకు రూ.3 వేలు, డిప్లొమా వారికి రూ.1,500, 24 నెలల పాటు అందిస్తామన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా మహిళా యజమానికి నెలకు రూ. 2వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తామన్నారు.