కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
కర్ణాటక సీఎం పదవికి ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.
సీఎం ఎంపికపై చర్చించేందుకు ఇప్పటికే సిద్ధరామయ్య దిల్లీకి చేరుకోగా, శివకుమార్ మంగళవారం దేశరాజధానికి వెళ్లనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో కూడిన పార్టీ నాయకత్వం కర్ణాటక సీఎం ఎవరనేది తేల్చనున్నారు.
రానున్న 24 గంటల్లో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్
కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధిష్టానం
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఒక పరీక్ష అయితే, ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు మరో కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.
ఎన్నికలకు ముందు, శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఐక్యంగ ముందుకుపోయి ఎన్నికల్లో గెలిచింది.
ఈ క్రమంలో శివకుమార్, సిద్ధరామయ్య అనుచరులు సీఎం పదవి విషయంలో తరచుగా బహిరంగంగానే ఘర్షణ పడుతుండటం గమనార్హం.
సిద్ధరామయ్య మాస్ నాయకుడు. అన్ని వర్గాలలో ఆయనకు ఆదరణ ఉంది. 2013-18 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఆయనకు ఉంది.
శివకుమార్ బలమైన సంస్థాగత సామర్థ్యాలను కలిగి ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా శివకుమార్‌కు పేరుంది.
ఈ ఇద్దరు నాయకుల్లో కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్
నేను వెన్నుపోటు రాజకీయాలు చేయను: శివకుమార్
దిల్లీకి వెళ్లే ముందు శివకుమార్ విలేకరులతో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వల్లే తాను ఈరోజు ఉన్నానని అన్నారు. పార్టీ లేకుంటే అందరూ జీరోలే అన్నారు.
తాను వెన్నుపోటు రాజకీయాలు చేయనని, కర్ణాటకలో ఈగెలుపు వెనుక ఎవరు ఉన్నారో పార్టీ నాయకత్వం గుర్తించాలని అన్నారు.
తాను చిన్న పిల్లాడిని కాదని, ఎవరి ఉచ్చులోనూ పడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తనతో చెప్పిన విషయాలను కూడా ఈ సందర్భంగా శివకురామార్ గుర్తు చేసుకున్నారు.
'మీరు కర్ణాటకను విముక్తి చేస్తారని మీపై నాకు నమ్మకం ఉంది' అని గతంలో సోనియా చెప్పినట్లు డీకే పేర్కొన్నారు.
తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ఆయనకు శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.