సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?
కర్ణాటక సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తదుపరి సీఎంగా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. సిద్ధరామయ్యను సీఎం చేస్తే, మరి పీసీసీ చీఫ్ శివకుమార్‌కు అధిష్టానం ఎలా నచ్చజెప్పుతారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసిన తర్వాత సీఎం ఎంపిక తుది దశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు ఉండటంతో 75 ఏళ్ల సిద్ధరామయ్యను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామం లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకరిని సీఎంగా ఎంపిక చేస్తే మరొకరు దూరమవుతారా?
అయితే శివకుమార్ మాత్రం సీఎం రేసులో తాను వెనక్కి తగ్గది లేదని ఖర్గేతో జరిగిన సమావేశంలో ఖరాఖండిగా చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ తనను సీఎంగా ఎంపిక చేయకపోతే, తాను తిరుగుబాటు చేయనని ముందే శివకుమార్ చెప్పారు. తాను వెన్నుపోటు పొడవనని పేర్కొన్నారు. అధిష్టానానికి తాను నచ్చినా, నచ్చకపోయినా తాను బాధ్యత గల మనిషినని, బ్లాక్‌మెయిల్ చేయనని పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాస్ అప్పీల్ ఉన్న నాయకుడు. 2013నుంచి ఐదేళ్ల కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. శివకుమార్ సంస్థాగతంగా బలమున్న నాయకుడు. కష్ట సమయాల్లో పార్టీని అనేకసార్లు ఆదుకున్నారు. ట్రబుల్షూటర్‌గా ఆయనకు పేరుంది. ఈ ఇద్దరిలో సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా, మరొకరు పార్టీకి దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.