LOADING...
Andhra Pradesh: ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు
ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు

Andhra Pradesh: ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరకు కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ మరో ప్రపంచ ప్రాధాన్యత ఉన్న పంట 'కోకో' ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోకో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్న సమయంలో, ఏపీలో మాత్రం దిగుబడులు ఏటేటా పెరుగుతుండటం విశేషం. దేశంలో మొత్తం కోకో ఉత్పత్తిలో దాదాపు 40 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం రాష్ట్ర రైతాంగం సాధించిన ఘనతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలకంగా మారాయి. ఈ జిల్లాల నుంచే దేశ ఉత్పత్తిలో పెద్ద వాటా నమోదవుతోంది.

Details

చెట్ల నీడలో లాభదాయక సాగు

కోకో సాగుకు అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు రాష్ట్రానికి వరంగా మారాయి. సారవంతమైన నేలలు, సమృద్ధిగా నీటి వనరులు, చెట్ల నీడలో సాగయ్యే లక్షణం రైతులకు లాభదాయకంగా మారింది. కొబ్బరి, జీడిమామిడి, ఆయిల్‌పామ్‌ తోటలు విస్తృతంగా ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కోకోను అంతర పంటగా రైతులు పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40 వేల హెక్టార్లలో కోకో సాగు జరుగుతుండగా, భవిష్యత్తులో మూడు లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Details

బహుళ ప్రయోజనాలతో రైతులకు భరోసా

కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల అదనపు భూమి అవసరం ఉండదు. ప్రధాన పంటలు ప్రకృతి విపత్తులు లేదా చీడపీడల వల్ల నష్టపోయినా, కోకో రైతులకు స్థిర ఆదాయాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పంటకు కొబ్బరి, ఆయిల్‌పామ్‌కు వేసే ఎరువులే సరిపోతాయి. ఎకరానికి సగటున 750 కిలోల ఆకులు రాలడం వల్ల నేలపై సహజ కవచం ఏర్పడి కలుపు మొక్కలు పెరగకుండా అడ్డుకుంటుంది. అలాగే తేమ నిల్వ ఉండటంతో పాటు ఆ ఆకులు కుళ్లి సహజ ఎరువులుగా మారి నేల సారాన్ని పెంచుతాయి. ఫలితంగా దిగుబడులు మరింత మెరుగవుతున్నాయి.

Advertisement

Details

ఇతర దేశాల్లో పడిపోతున్న దిగుబడులు

ఘనా, తూర్పు ఆఫ్రికా, బ్రెజిల్‌, కొన్ని ఆసియా దేశాల్లో కోకో సాగు విస్తృతంగా జరుగుతున్నప్పటికీ, అక్కడ పర్యావరణ సమస్యలు తీవ్రంగా మారాయి. అడవులను నరికి సాగు విస్తీర్ణం పెంచడంపై ఆంక్షలు విధించడంతో పాటు, బాల కార్మికుల వినియోగంపై వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆయా దేశాల్లో కోకో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. అదేవిధంగా అక్కడి కోకో చెట్ల వయసు 40-50 ఏళ్ల మధ్య ఉండటంతో దిగుబడులు తగ్గుతున్నాయి. అయితే కోకో చెట్లు మూడేళ్లకే దిగుబడి ఇవ్వడం ప్రారంభించి 60 ఏళ్ల వరకు ఆదాయం అందించే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.

Advertisement

Details

దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ

కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కోకో సాగు 1970లలోనే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆలస్యంగా సాగు మొదలైనప్పటికీ, మెరుగైన యాజమాన్య పద్ధతులు, శాస్త్రీయ సాగు విధానాల కారణంగా ప్రస్తుతం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో హెక్టార్‌కు సగటున 1200 కిలోల కోకో గింజల దిగుబడి వస్తుండగా, ప్రపంచ సగటు మాత్రం 500-600 కిలోల మధ్యే ఉంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 30 వేల టన్నుల కోకో ఉత్పత్తి జరుగుతుండగా, ఏపీలోనే 12-13 వేల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది దేశ ఉత్పత్తిలో 40 శాతం కావడం విశేషం.

Details

గ్లోబల్ హబ్‌గా మారాలంటే

ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్‌ తయారీ, అనుబంధ ఉత్పత్తులకు ఏటా సుమారు 50 లక్షల టన్నుల కోకో గింజలు అవసరం అవుతున్నాయి. భారతదేశానికి 2030 నాటికి 1.25 లక్షల టన్నుల అవసరం ఉంటుందని అంచనా. ఏపీ నిజంగా గ్లోబల్‌ హబ్‌గా మారాలంటే 2040 నాటికి 5 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంటుందని, అందుకోసం ఏటా కనీసం 10 వేల హెక్టార్లలో అదనపు సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని సీపీసీఆర్‌ఐ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్‌ చౌడప్ప తెలిపారు.

Advertisement