CBSE: సీబీఎస్‌ఈ ఓఎస్ఎం పోర్టల్ కాంట్రాక్ట్ రేసులో టీసీఎస్‌ను 60% తేడాతో వెనక్కి నెట్టిన కోఎంప్ట్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకన సేవలకు సంబంధించిన భారీ టెండర్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. టెండర్ రికార్డుల ప్రకారం సాంకేతిక మూల్యాంకనంలో టీసీఎస్ కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించిన కోఎంప్ట్, ఆర్థిక బిడ్‌లోనూ భారీ ఆధిక్యం చూపించి విజేతగా నిలిచింది.
వివరాలు
రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభంలో ఆలస్యం
ఈ ఏడాది సీబీఎస్‌ఈ పూర్తిస్థాయిలో అమలు చేసిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు విద్యార్థులు, మూల్యాంకనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫలితాల అనంతర సేవలు, రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభంలో ఆలస్యం జరగడం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో టెండర్ ప్రక్రియ, సేవలందించే సంస్థ ఎంపికపై అందరి దృష్టి పడింది. సాంకేతిక మూల్యాంకనంలో మొత్తం 100 మార్కులకు గాను కోఎంప్ట్ 91 మార్కులు సాధించగా, టీసీఎస్ 89 మార్కులు పొందింది. ఉద్యోగుల సంఖ్య, CMMI, ISO సర్టిఫికేషన్లు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ వంటి కీలక విభాగాల్లో రెండు సంస్థలు సమానంగా పూర్తి మార్కులు సాధించాయి.
వివరాలు
రెండు సంస్థల మధ్య భారీ వ్యత్యాసం
టర్నోవర్ పరంగా చూస్తే రెండు సంస్థల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.67 లక్షల కోట్ల ఆదాయం, 5.84 లక్షలకుపైగా ఉద్యోగులతో ఉన్న టీసీఎస్‌కు టర్నోవర్ విభాగంలో పూర్తి 5 మార్కులు లభించాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య టర్నోవర్ నమోదు చేసిన కోఎంప్ట్ ఈ విభాగంలో 2 మార్కులు మాత్రమే పొందింది. అయితే మానవ వనరుల విభాగంలో 100 మందికిపైగా సిబ్బంది ఉండటంతో రెండు సంస్థలకూ గరిష్ట మార్కులు కేటాయించారు.
వివరాలు
కోఎంప్ట్‌కు డిజిటల్ మూల్యాంకన ప్రాజెక్టులను నిర్వహించిన అనుభవం
ఈ టెండర్‌లో కీలకమైన గత అనుభవం విభాగంలో కోఎంప్ట్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మొత్తం 35 మార్కుల విభాగంలో కోఎంప్ట్ 32 మార్కులు సాధించగా, టీసీఎస్ 25 మార్కులు మాత్రమే పొందింది. ముఖ్యంగా సబ్జెక్టివ్ జవాబు పత్రాల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన పంపిణీ విభాగంలో కోఎంప్ట్ పూర్తి 10 మార్కులు దక్కించుకోగా, టీసీఎస్‌కు ఒక్క మార్కు కూడా రాలేదు. పెద్ద ఎత్తున డిజిటల్ మూల్యాంకన ప్రాజెక్టులను నిర్వహించిన అనుభవం కోఎంప్ట్‌కు కలిసి వచ్చింది. పరీక్షల సాంకేతిక రంగంలో తమకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉందని సంస్థ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొంది.
వివరాలు
టెక్నికల్ ప్రెజెంటేషన్, లైవ్ డెమో విభాగంలో టీసీఎస్ మెరుగైన ప్రదర్శన
మరోవైపు టెక్నికల్ ప్రెజెంటేషన్, లైవ్ డెమో విభాగంలో టీసీఎస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 15 మార్కులకు గాను 14 మార్కులు సాధించగా, కోఎంప్ట్ 9 మార్కులకే పరిమితమైంది. టెండర్ ప్రక్రియపై సీబీఎస్‌ఈ అధికారికంగా స్పందించనప్పటికీ, ఒక సీనియర్ అధికారి కీలక వివరాలు వెల్లడించారు. సాంకేతిక మూల్యాంకనంలో బోర్డుకు విచక్షణాధికారం ఉన్న ఏకైక అంశం ప్రెజెంటేషన్ మాత్రమేనని, ఆ విభాగంలో టీసీఎస్‌కే అధిక మార్కులు వచ్చాయని తెలిపారు. దీంతో మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కోఎంప్ట్ సంస్థకు టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని, ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా పరీక్షల బోర్డు కూడా దానిని బ్లాక్‌లిస్ట్ చేయలేదని అధికారులు వివరించారు.
వివరాలు
రెండు సంస్థల మధ్య సుమారు రూ.566 కోట్ల వ్యత్యాసం
ఆర్థిక బిడ్‌ల పరిశీలనలో రెండు సంస్థల మధ్య భారీ తేడా బయటపడింది. బిల్ ఆఫ్ క్వాంటిటీస్ (BoQ) పత్రాల ప్రకారం ఒక్క జవాబు పత్రం మూల్యాంకనానికి కోఎంప్ట్ రూ.24.75 నుంచి రూ.25.74 వరకు ధర ప్రతిపాదించింది. అదే సేవకు టీసీఎస్ రూ.53 నుంచి రూ.65 వరకు కోట్ చేసింది. మొత్తం ప్రాజెక్ట్ విలువను లెక్కిస్తే కోఎంప్ట్ బిడ్ దాదాపు రూ.384.6 కోట్లుగా ఉండగా, టీసీఎస్ బిడ్ రూ.951.3 కోట్లకు చేరింది. అంటే రెండు సంస్థల మధ్య సుమారు రూ.566 కోట్ల వ్యత్యాసం నమోదైంది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాదాపు 9.86 మిలియన్ల జవాబు పత్రాలను ఓఎస్ఎం విధానంలో మూల్యాంకనం చేసింది.
వివరాలు
క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ విధానంలో కాంట్రాక్టు
ఈ కాంట్రాక్టును క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ (QCBS) విధానంలో కేటాయించారు. ఇందులో సాంకేతిక స్కోరుకు 70శాతం,ఆర్థిక బిడ్‌కు 30శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ విధానంలో తక్కువ ధరను కోట్ చేసిన సంస్థకు ఆర్థిక విభాగంలో అధిక మార్కులు లభిస్తాయి. సాంకేతికంగా అర్హత సాధించడంతో పాటు ధరలో స్పష్టమైన ఆధిక్యం చూపిన సంస్థకే తుది ఎంపికలో అవకాశం దక్కుతుంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారమే కోఎంప్ట్‌ను ఎంపిక చేసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా,ప్రస్తుతం సీబీఎస్‌ఈ ఓఎస్ఎం పోర్టల్‌కు సంబంధించి చర్చనీయాంశంగా మారిన కోఎంప్ట్ సంస్థకు సంబంధించిన పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పరీక్షల నిర్వహణ,డిజిటల్ మూల్యాంకన వ్యవస్థల విషయంలో ఈ సంస్థ పేరు గతంలో కూడా వార్తల్లో నిలిచింది.
వివరాలు
3.8 లక్షల మంది ఫెయిల్
2019 ఏప్రిల్‌లో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల సమయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన 9.7 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 3.8 లక్షల మంది ఫెయిల్ అయినట్లు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మార్కుల కేటాయింపులో చోటుచేసుకున్న సాంకేతిక లోపాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వివరాలు
చర్చనీయాంశంగా మారిన సీబీఎస్‌ఈ టెండర్‌లో విజయం సాధించిన కోఎంప్ట్
ఆ సమయంలో ఇంటర్ బోర్డు పరిపాలన, పరీక్షల డిజిటలైజేషన్ సాఫ్ట్‌వేర్ బాధ్యతలను గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించింది. అనంతరం ఆ వివాదం జరిగిన ఆరు నెలల వ్యవధిలోనే గ్లోబరీనా సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చుకున్నట్లు కంపెనీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సీబీఎస్‌ఈ టెండర్‌లో విజయం సాధించిన కోఎంప్ట్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.